Search This Blog

Friday, July 22, 2016

22 Jul Pi Approximation Day

*22 జూలై పై “π” సామీప్య దినోత్సవము (22 Jul Pi Approximation Day)*

గణిత శాస్త్రం‌లో వృత్తానికీ,దాని వ్యాసమునకు గల నిష్పత్తిని గ్రీకు అక్షరమైన π తో సూచిస్తారు.

మానవ నాగరితతో పాటుగా “π” (22/7) భావనకు సమాంతర చరిత్ర ఉంది. గణిత శాస్త్ర అధ్యయనం ప్రారంభమైననాటినుండి నేటివరకు, రేపటి తరాలలోకూడా శాస్త్రవేత్తలనూ, గణితాధ్యాయిలనూ, ఉపాధ్యాయులనూ ఈసంఖ్య అబ్బురపరుస్తూనే ఉంటుంది. రేఖా గణితం, త్రికోణమితి శాస్త్రాలలో ఈ భావన సర్వాంతర్యామి. ఈభావన స్పృజించకుండా ఏ అనువర్తిత శాస్త్రమూ (applied science) మనజాలలేదనడం అతిశయోక్తి కాదు. π విలువ ఒక కరణీయ సంఖ్య (దశాంశం తదుపరి శేషము 0 అంటె శూన్యము రాకుండా, ఒకే అంకె పునరావృతం కాకుండా, అంకెలపరంపర- అనంతంగా- కొనసాగుతూనే ఉంటుంది).

భారత గణితవేత్తలు వేదాంగాలలోనూ, సులభసూత్రాలలోనూ దీన్ని చర్చించి, విలువను గణించారు. ఒక వృత్తం చుట్టుకొలత దాని వ్యాసానికి మూడింతల పొడుగుంటుందని లెక్కించారు. మహాభారత భీష్మపర్వం‌లో (XII: 44) 3 గా సూచించారు.

సులభ సూత్రాలు, మానవ సులభ సూత్రాలు, జైనులు, తదనంతరం వరాహమిహిరుడు, బ్రహ్మగుప్తుడు, శ్రీధరుడు సైతం ఈ విషయాన్ని చర్చించారు. ఆర్యభట్ట (క్రీ. శ. 476) తో భారతీయ గణిత శాస్త్రం‌లో నూతన అధ్యాయం ప్రారంభమైంది. ఆర్య భట్ట దీనిని 62832/20000 = 3.1416 గా గణించాడు. నాలుగు దశాంశాలవరకూ ఈ విలువ ఖగోళ శాస్త్రం‌లో ఖచ్చితంగా సరిపొయింది. ఈ భావననూ, విలువనూ తదనంతరం చైనీయులూ, అరబ్బులూ స్వీకరించారు. తదుపరి కేరళ రాష్ట్రానికి చెందిన సంగ్రామ మాధవుడు దీని విలువను పదకొండు దశాంశాలవరకు లెక్కించాడు. π విలువను గణిత శాస్త్రవేత్తలు నాలుగు దశాంశాలలో 3.1415 గా నిర్ధారించారు.

*బ్రిటష్‌వారు తేదీ. నెల. సంవత్సరం రూపం‌లొ (Date format)  22/7 (జులై) తేదీన  π దినోత్సవాన్ని నిర్వహిస్తే*  , *అమెరికన్లు నెల.తేదీ. సంవత్సరం రూపం‌లొ (Date format)  మార్చి 14 వ తేదీన (π =3.14) π దినోత్సవాన్ని నిర్వహిస్తారు.*  π విలువ నాలుగు దశాంశాలవరకు 3.1415 కావడంవల్ల 2015 సం.  మార్చ్ నెల 14 వతేదీని అమెరికన్లు సూపర్ π దినోత్సవంగా జరుపుకున్నారు. తిరిగి సూపర్ π దినోత్సవం శతాబ్దం తర్వాత అంటే  2115లో సంభవిస్తుంది.

Π దినోత్సవం గురించి మరిన్ని విశేషాలు తెల్సుకుందాం.

• గణీతవేత్తలు 22/7 ఫలితాన్ని అరవైనాలుగుకోట్ల దశాంశంవరకు లెక్కించారు. విచిత్రం, ఒక్కసారంటే ఒక్కసారికూడా 123456లు వరుసగా రాలేదు.
• గ్రీకువర్ణమాలలో π స్థానం 16 అలాగే ఆంగ్లవర్ణమాలలోనూ  p అక్షర స్థానం 16యే.
• మరో విచిత్రమైన సారూప్యం. విశ్వ విఖ్యాత భౌతికశాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, నిత్య సత్యాగ్రహి ఇరోమ్ షర్మిల (మణిపూర్) జన్మించింది కూడా మార్చి నెల 14 వ తేదీన. ఐన్‌స్టీన్ ప్రవచించిన పరమాణు శక్తికి సూత్రం E=mc2 అర్ధంచేసుకోవడానికి బుర్ర బద్దలుకొట్టుకోవాల్సివస్తుంది. బుర్రబద్దలుకొట్టుకున్నా π విలువను కనుక్కోవడం అసంభవం. మ‌ణిపూర్‌లో మానవహక్కుల ప్రతిష్టాపన జరిగేదాకా ఈరోమ్ షర్మిలకూడా అంతులేని పోరాటం చేస్తానంటూంది.
• Π విలువను అరవైనాలుగుకోట్ల దశాంశాలవరకు పరిష్కరించారు. ఈసంఖ్యను  ఏకబిగిన చదవడానికి 133 సంవత్సరాల కాలం పడుతుంది. అంటే మళ్ళీవచ్చే సూపర్ π దినోత్సవం (2115) వరకు కూడా చదవడం  పూర్తికాదు.
• వృత్తానికి మూలలు లేవనిచెబుతారు. నిజానికి వృత్తపు చుట్టుకొలతలోగల కోణాలు అనంతం, దానిలోని దశాంశాల మాదిరిగానే.
• 14 మార్చినుండి 22 జులై వరకు (రెండుతేదీలను కలిపి) 131 రోజులు. ఐక్యూ 131 గాఉన్నవారిని అత్యంత మేధోసంపత్తిగలవారిగా పరిగణిస్తారు. నిజం, π విలువను పరిష్కరించినవారు నిక్కంగా అత్యంత మేధావియే.
• ఇంకా 131 ఒక ప్రధాన సంఖ్య.
• Π (పై) లోనికి వెళ్ళి చూస్తే భీకర భీతావహంగా ఉందికదూ!!!


π దినోత్సవాలలో ప్రాచీనభారతం‌లోనూ నాటిసమకాలీన నాగరికతలలోనూ గణిత శాస్త్రం‌లో జరిగిన అభివృధ్దిని చర్చించి వ్యాసరచన, వక్తృత్వపోటీలు నిర్వహించవచ్చు. నిర్దిష్ట సమయంలో దీని విలువను ఎన్ని దశాంశం‌లవరకు సాధించగలరో పోటీనిర్వహించి చిన్న చిన్న బహుమతులు ఇవ్వవచ్చు. గణితం పట్ల ఆసక్తిపెంచడానికి ఈ తేదీని వేదిక చేసుకోవడం ఉపయుక్తం.
J N SWAMY